ఏపీని కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుతోంది.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 657 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 15 వేలు దాటేశాయి. అలాగే రెడ్, కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అవసరమైన చోట్ల కఠినమైన నిబంధనలతో లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో జులై 31వ తేదీ వరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ను పొడిగించారు. జిల్లాలో అనూహ్యంగా కరోనా కేసులు పెరగడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కట్టడి ప్రాంతాల్లో లాక్డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు, చీరాల, మార్కాపురంలో లాక్డౌన్ కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ లాక్- 2లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో నిబంధనల మేరకు కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు.