రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్‌లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్‌లలో నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్ఫష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి మహరాష్ట్రలో ప్రార్థనా మందిరాలు, థియేటర్‌లు, స్విమ్మింగ్ పూల్‌లతో పాటు ఇతర సామాజిక, రాజకీయ కార్యాలయాలు ఇంకా తెరుచుకొలేదు. ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా… అందులో 273,838 మంది డిశ్చార్స్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14, 905 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 1,320గా నమోదయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులలో మరణాల రేటు 0.45 శాతంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,470 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. ఇక 1,800 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఖుర్దా జిల్లాలో ఒక్కరోజులోనే గరిష్టంగా 159 కేసులు, కటక్‌లో 98, అంగుల్‌లో 95 కేసులను నమోదు కాగా.. కరోనాతో గంజాం జిల్లాలో 229 మంది, ఖుర్దా -226, కటక్ -10 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు తెరించేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అదే విధంగా జూన్ 15 నుంచి అత్యవసర సేవల కొరకు పరిమిత సంఖ్యలో ప్రత్యేక సబర్బన్ రైళ్లను రైల్వే అధికారులు తిరిగి ప్రారంభించారు.