టీడీపీ ఎంపీల నిర‌స‌న‌తో లోక్ స‌భ మార్చి 5కు వాయిదా

Lok sabha postponed march 5 because of TDP MP's Protest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లోక్ స‌భ మార్చి 5కు వాయిదా ప‌డింది. టీడీపీ స‌భ్యుల ఆందోళ‌నా ఉధృతి పెర‌గ‌డంతో లోక్ స‌భ న‌డిపే ప‌రిస్థితి లేద‌ని చెబుతూ స్పీక‌ర్ సుమిత్రామ‌హాజ‌న‌న్ స‌భ‌ను వాయిదా వేశారు. ఈ ఉద‌యం స‌భ ప్రారంభంకాగానే గ‌త నాలుగురోజులుగా చేస్తున్న‌ట్టుగానే టీడీపీ ఎంపీలు ఆందోళ‌న ప్రారంభించారు. ఏపీకి న్యాయం చేయాల‌ని కోరుతూ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదావేశారు. అనంత‌రం స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. స‌భ వాయిదా ప‌డిన స‌మ‌యంలో పార్ల‌మెంట్ బ‌య‌ట నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించిన టీడీపీ నేత‌లు రెండోసారి స‌భ ప్రారంభం కాగానే వెల్ వ‌ద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి ఆందోళ‌న సాగుతుండ‌గానే స్పీక‌ర్ ప‌లువురు స‌భ్యులు బిల్లులు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాన్ని క‌ల్పించారు. టీడీపీ ఎంపీల నినాదాల మ‌ధ్యే కొంద‌రు స‌భ్యులు బిల్లులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం కూడా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో స‌భ‌ను వాయిదావేస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

అటు రాజ్య‌స‌భ‌లోనూ ఏపీ ఎంపీల ఆందోళ‌న కొనసాగింది. నాలుగురోజులుగా వెల్ లో ఒంట‌రిగా నిల‌బ‌డి ఆందోళ‌న చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి ఇవాళ టీడీపీ ఎంపీలు సీఎం ర‌మేశ్, టీజీ వెంక‌టేశ్ తో పాటు మరికొంద‌రు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న్యాయం చేయాల‌ని వారంతా వెల్ లో నిల‌బ‌డి నినాదాలు చేయ‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. స‌భ్యుల తీరుపై రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ త‌ర‌హా నిర‌స‌న‌లను ప్ర‌జ‌లు చూడాల‌ని తాను భావించ‌డం లేద‌ని, వారివైపు కెమెరాలు తిప్ప‌వ‌ద్ద‌ని ఆదేశించారు. అనంత‌రం స‌భ‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదావేశారు