తీవ్రమయిన లారీల సమ్మె…ఇక అత్యవసర సేవలు కూడా బంద్ !

డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు చేపట్టిన సమ్మె తీవ్రతరమవుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లారీ యజమానులు చేపట్టిన సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. పెట్రోల్, డిజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం తో పాటు టోల్‌గేట్ ఫ్రీ ఇండియాగా ప్రకటించాలన్న ప్రదాన డిమాండ్లతో జాతీయ స్థాయిలో లారీ యజమానులు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు లక్షల లారీలు ఎక్కడివి అక్కడే నిలిచి పోయాయి. నేటి నుండి అత్యంత కీలకమైన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ రవాణాను సైతం నిలిపివేయాలని నిర్ణయించినట్టు లారీల యజమానుల సంఘం పేర్కొంది.

ఇక, లారీల సమ్మె ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించడం ప్రారంభించింది. ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. లారీ సమ్మె ప్రభావం బియ్యం, పప్పుదినుసులపై భారీగా ఉంది. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లారీల సమ్మెకు మద్దతుగా మంగళవారం పెట్రోల్, డిజిల్ సరఫరా చేస్తున్న ఆయిల్ ట్యాంకర్లను సైతం నిలిపివేశారు. దీంతో ప్రజా జీవనం అస్థవ్యస్థం కానుంది.

ఇప్పటి వరకు అత్యవసర సరుకులైన పాలు, కూరగాయలు, పెట్రోల్‌, డీజిల్‌ ఆయిల్‌ రవాణా సాగింది. లారీ యజమానుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బంద్‌ను తీవ్రతరం చేసేందుకు అత్యవసరాలను కూడా నిలిపివేస్తామని లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. మంగళవారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ లోడింగ్‌కు కూడా లారీలు ఆపివేయడంతో నేటి నుండి అత్యవసర సరుకుల రవాణా కూడా నిలిచిపోనుంది. ఇప్పటికే కిరాణా సరుకులైన పప్పు, ఉప్పు, పిండి, నూనెల రవాణా నిలిచిపోయింది. దీంతో, నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు పెంచేశారు.

పోలవరానికి కూడా…

లారీల సమ్మె ప్రభావం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడింది. సమ్మె నేపథ్యంలో పోలవరానికి వచ్చే సిమెంటు ట్యాంకర్ల రాక తగ్గింది. దీంతో నిర్మాణ పనులు మందగించినట్టు ‘నవయుగ’ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రోజూ వివిధ కంపెనీల నుంచి 50 ట్యాంకర్ల ద్వారా సిమెంట్ వచ్చేది. అయితే, లారీల సమ్మె కారణంగా మూడు, నాలుగు ట్యాంకర్లు మాత్రమే వస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్పిల్‌వే, స్పిల్‌ఛానల్‌లో రోజుకు 1,260 టన్నుల సిమెంటు అవసరమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం సిమెంటు సరఫరా ఆగిపోవడంతో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పనులకు ఆటంకం లేకుండా చూసుకుంటున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు అయితే కాంక్రీట్ పనులకు ఎటువంటి ఆటంకం ఏర్పడలేదని, కాకపోతే సిమెంటు సరఫరా తగ్గడంతో పనులు కొంత మందగించాయని వివరించారు.