జాన్వీని తీసుకు వచ్చేందుకు ఆశ పడుతున్నాడు

Jhanvi Kapoor to the Telugu film industry

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకునే అతిలోక సుందరి శ్రీదేవి ఇటీవలే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిన విషయం తెల్సిందే. శ్రీదేవి లేని లోటును ఆమె పెద్ద కుమార్తె జాన్వీ తీరుస్తుందని కపూర్‌ ఫ్యామిలీ చెబుతుంది. ఇటీవలే జాన్వీ నటించిన ‘ధడక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ధడక్‌’ చిత్రంలో నటన పరంగా జాన్వీకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో జాన్వీకి తిరుగు లేదని అంతా భావిస్తున్నారు. జాన్వీ మొదటి సినిమా సౌత్‌లో ఉంటుందని మొదట అంతా అనుకున్నారు. శ్రీదేవి కూడా జాన్వీని సౌత్‌లో తీసుకు రావాలని భావించినా కూడా బోణీ కపూర్‌ మాత్రం హిందీలోనే పరిచయం చేయాలని పట్టుబట్టి అక్కడే పరిచయం చేశాడు.

ఇప్పుడు జాన్వీని తెలుగు సినీ పరిశ్రమకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రముఖ నిర్మాత జాన్వీకి బాలీవుడ్‌లో కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి నటింపజేయాలని భావిస్తున్నాడు. ఒక యంగ్‌ హీరోతో ఆయన చేయబోతున్న చిత్రం కోసం జాన్వీని ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మరికొన్ని చిత్రాలు హిందీలో చేసిన తర్వాత మాత్రమే తెలుగు లేదా ఇతర భాషల్లో చేయాలని జాన్వీ కపూర్‌ భావిస్తుంది. బోణీ కపూర్‌ కూడా అదే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సదరు తెలుగు నిర్మాత మాత్రం బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ సాయంతో ఆమెను తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ధడక్‌ చిత్రానికి జాన్వీ కేవలం 60 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంది. తెలుగులో ఆమె రెండవ సినిమా చేస్తే 1.5 కోట్లు ఇస్తానంటూ నిర్మాత చెబుతున్నాడు. మరి జాన్వీ ఆలోచనలో మార్పు వచ్చి తెలుగులో నటిస్తుందా అనేది చూడాలి. ఒక వేళ జాన్వీ తెలుగులో నటిస్తే బ్రహ్మరథం పట్టడం ఖాయం.