చిల్లరతో ‘కొట్టాడు’ !

మనం రకరకాల టార్చర్లు చూసుంటాము కానీ ఇటువంటి టార్చర్ ఎక్కడా చూసుండము, ఎందుకంటే యా టార్చర్ మనకి ఊహకి కూడా అందదు. మనం కొన్ని సార్లు సెంటిమెంటుతో కొట్టాడు, లా పాయింట్ తో కొట్టాడు అనే మాటలు వింటుంటాం. కానీ లా తెలిసిన ఒక లాయర్ మాత్రం చిల్లరతో కొట్టాడు. ఛండీఘర్‌కు చెందిన లాయర్ భార్య 2015లో తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. విడాకులు మంజూరు చేసిన కోర్టు ప్రతి నెలా ఆమెకు రూ.25వేలు భరణం చెల్లించాలని ఆ లాయర్ ని ఆదేశించింది. రెండు నెలలుగా లాయర్ తన మాజీ భార్యకు డబ్బును పంపించడం లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా భర్త తన దగ్గర డబ్బు లేదని జడ్జి ముందు బుకాయించే ప్రయత్నం చేశాడు. అవన్నీ అబద్ధాలని ఆయన పేరు మోసిన లాయరని ఆయన పేరుమీద ఆస్తులు కూడా ఉన్నాయని కోర్టుకు మహిళ చెప్పింది.

దీంతో జడ్జి భరణం చెల్లించాల్సిందేనని ఆదేశించారు. దీంతో ఆమెపై కోపంతో కొత్తరకం టార్చర్ చూపిస్తూ.. ఆమెకు ప్రతి నెలా ఇవ్వాల్సిన భరణాన్ని వెరైటీగా చిల్లర రూపంలో చెల్లించాడు. 4 వంద రూపాయల నోట్లు ఇచ్చి.. మిగిలిన డబ్బు మొత్తాన్ని బ్యాగుల్లో రూపాయి, రెండు రూపాయల కాయిన్లగా తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు. ఈ చిల్లరంతా చూసి ఆమె షాకయ్యింది. తనకు మళ్లీ అన్యాయం జరిగిందని కోర్టుకు తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే తన మాజీ భర్త కాయిన్లు తెచ్చి ఇచ్చాడని.. తనపై కోపంతోనే ఇలా టార్చర్ పెడుతున్నాడని ఆరోపించింది. ఈ డబ్బును బ్యాంకులో కూడా తీసుకోరని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కాయిన్ల కహానీతో షాకైన కోర్టు జడ్జి కేసును ఈ నెల 27కు వాయిదా వేశారు. ముందు చిల్లరను లెక్కపెట్టాలని ఆదేశించారు.