ప్రేమ పెళ్లి.. ఆపై మనస్తాపం…. మూడు నెలలకే యువతి ఆత్మహత్య…

అత్తింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడే మూడు నెలలకు బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీంతో దోమ మండలం పరిధిలోని గుండాల్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపట్ల అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత.. అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వలస వచ్చారు.

అయితే లాక్‌డౌన్ ప్రభావంతో వారికి ఉపాధి దొరక్కపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే భర్త తనను వేధిస్తున్నాడని.. నవనీత తల్లికి అనేక సార్లు ఫోన్ చేసి బాధపడిన ఘటనలు కూడా ఉన్నాయి. కాగా నెల రోజుల క్రితం శివకుమార్‌రెడ్డి భార్యతో కలిసి సొంతూరుకి వచ్చి నవనీతను పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి మనస్తాపంగా ఉంటున్న బాలిక తాజాగా అర్థరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది కుటుంబసభ్యులు గమనించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అవగాహన లేని ప్రేమలు పెళ్లిళ్లు చేసుకుంటే ఇలాగే ఉంటాయనే అభిప్రాయాన్ని ప్రజలు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.