తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని సొన్నాంకుప్పం గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె త్రిష అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతోంది. అలాగే కీల్ ఆలత్తూరు గ్రామానికి చెందిన పుణ్యకోటి కుమారుడు యశ్వంత్ గుడియాత్తంలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.
వేకువజామున ప్రేమికులు ఇద్దరు గుడియాత్తం సమీపంలోని కావనూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి వెళ్లారు. ఆ సమయంలో చెన్నై నుంచి జోలార్‌పేట వైపు వస్తున్న ఎలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన లోకో పైలెట్ జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.