ప్రేమ పెళ్లి చేసుకుని హాయిగా నడుస్తున్న వారి కాపురంలో స్మార్ట్ ఫోన్ నిప్పులు పోసింది. భార్య ఎవరితోనో చాట్ చేస్తుందని అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపి పోలీసులకి లొంగిపోయాడు. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే గాంధీనగర్‌కు చెందిన శ్రావణ్, మౌనిక పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య మౌనికను డిగ్రీ చదివించిన శ్రావణ్ ఇటీవల లాసెట్ పరీక్ష కూడా రాయించాడు. అయితే ఏ పనీ చేయని శ్రావణ్ తండ్రి వారసత్వ ఉద్యోగం (సింగరేణి) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భార్యపై శ్రావణ్ అనుమానం పెంచుకున్నాడు. మౌనిక వాట్సాప్ లో వేరే వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో శ్రావణ్ భార్య పై ద్వేషం పెంచుకున్నాడు. తరచూ గొడవపడేవాడు. తన భార్య పొద్దుస్తమానం ఫోన్ పట్టుకొని తిరగడం చూసి భర్తకు అనుమానం వచ్చింది. తన భార్య వేరేవాళ్లతో చాటింగ్ చేస్తుందన్న అనుమానం మరింత బల పడింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. భార్యతో గొడవకు దిగాడు. ఆగ్రహం కట్టెలు తెంచుకొని రావడంతో తట్టుకోలేక కట్టుకున్న భార్యను కడతేర్చాడు. రాడ్డుతో మోది హత్య చేసి అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.