ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేశాడు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. చెబితే తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. గర్భం పోయేందుకు మందులిచ్చాడు. అవి వికటించి బాలిక మృతిచెందింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఈ ఘటన జరిగింది. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
అదే కాలనీకి చెందిన ఏర్పుల భాను ఆ బాలికతో ప్రేమ పేరిట కొంతకాలంగా సఖ్యతగా ఉంటున్నాడు. గత నెల 28న బాలిక తన ఇంట్లో వాంతులు చేసుకుని కిందపడిపోయింది. కుటుంబీకులు ఏమైందని అడగ్గా.. ప్రేమిస్తున్నానని చెప్పి భాను రెండు, మూడు సార్లు లైంగిక దాడి చేశాడని, గర్భం వచ్చిందని చెప్పింది. గర్భాన్ని తొలగించేందుకు బలవంతంగా మందులు వేశాడని తెలిపింది. అదే రోజు రాత్రి బాలికను కుటుంబీకులు నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
బాలిక పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు చెప్పగా గత నెల 29న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై బాలిక కుటుంబీకులు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో 30న ఫిర్యాదు చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించి బాలిక గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహంతో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద, నిందితుడు భాను ఇంటి ముందు కుటుంబీకులు, ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పినా రాత్రి వరకు ఆందోళన చేశారు. భాను కుటుంబీకులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.