వారిద్దరు ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఖాయం చేయడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గాంధారి మండలం పోతంగల్ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్, కామారెడ్డి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన గాండ్ల రమ్య(19) కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరు వరుసకు బావమరదళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో రమ్యకు కుటుంబ సభ్యులు ఇటీవల మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు.
దీంతో ఆందోళన చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. అనంతరం కామారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఇద్దరూ బస్సులో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్‌కు తెలపడంతో వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలిసంచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా సాయికుమార్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.