ప్రేమపేరిట మాయమాటలు

ప్రేమపేరిట మాయమాటలు

పాఠశాలకని వెళ్లిన బాలిక అదృశ్యమై రెండురోజుల తర్వాత విగతజీవిగా కనిపించింది. ఆమెతోపాటు ఆటోడ్రైవర్‌ కూడా బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్న ఆటోడ్రైవర్, ఆ బాలికను ప్రేమపేరిట మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకి చెందిన మాయర సర్వేష్‌ – కృష్ణవేణి దంపతుల పెద్ద కుమార్తె అనూష స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

అదే గ్రామానికి చెందిన పోరల్ల జగ్గారావు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గ్రామానికి చెందిన పలువురితో కలసి అనూష కూడా జగ్గారావు ఆటోలో పాఠశాలకు వెళ్లివచ్చేది. ఈ క్రమంలోనే అతడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి ఆమెను వశపర్చుకున్నట్లు సమాచారం. సోమవారం రోజులాగే పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్న భోజన సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అయితే, అప్పటికే పాఠశాల బయట వేచి ఉన్న జగ్గారావు ఆమెను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వారు అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి కొత్తగూడెం డిపో బస్సు ఎక్కి కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ కనిపించడంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌ వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ రాక ఆలస్యం కావడంతో బస్సులోనే వారిద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.