ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన దివ్య అలియాస్ బ్యాగరి మాధవి (17), నీరడి రాజు (23) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇంటి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గత నెల 30న గ్రామ శివారులోని పంట చేనుకు వెళ్లి గడ్డి మందు తాగారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇరువురిని చికిత్స నిమిత్తం హైదరాబాలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మాధవి మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. మాధవి 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. రాజు 10వ తరగతి పూర్తి కాగానే దుబాయి వెళ్లాడు.
అక్కడ రెండేళ్లు ఉన్న అనంతరం కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.