వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని శతకోడుకు చెందిన షేక్.ఆదాం (22) మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శ్యామలత (20) గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇంటర్ పూర్తి చేసింది.వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని భావించి పెద్దలకు చెప్పారు. అందుకు వారు అంగీకరించలేదు. ఇంతలోనే ఆదాంకు తన సామాజికవర్గానికి చెందిన అమ్మాయితో ఈ నెల 4వ తేదీ వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. దీనిని ప్రేమికులిద్దరూ జీర్ణించుకోలేకపోయారు. సోమవారం పని మీద వెళ్తున్నామంటూ ఇంట్లో చెప్పి ఇద్దరూ వేర్వేరుగా వినుకొండ చేరుకున్నారు. అక్కడే రైలు కిందపడి తనువు చాలించారు. ఘటనపై నరసరావుపేట రైల్యే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.