రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, బంధువుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా ధర్మవరం కేతిరెడ్డికాలనీకి చెందిన లక్ష్మి (20), గంగ అలియాస్ గంగన్న (22) కూలీ పనులు చేసేవారు. దీంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. గతేడాది కర్నూల్ జిల్లా దేవనకొండకు చెందిన మరో వ్యక్తితో లక్ష్మికి పెద్దలు వివాహం జరిపించారు.
అనంతరం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. నాలుగు రోజుల క్రితం లక్ష్మి తమ బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి సోమవారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు వెళ్తూ ప్రేమికుడు గంగకు ఫోన్ చేసి గద్వాలకు రమ్మంది. దీంతో అతడు మరో రైలులో మంగళవారం తెల్లవారుజామున గద్వాలకు వచ్చి ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి మృతిచెందారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం అందించారు. ఇరువురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ వివరించారు.