జిల్లాలోని తలమడుగు మండలం దహేగామ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాకు చెందిన శ్రీరామ్,సుజాత అనే ప్రేమ జంట మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామ శివారు ప్రాంతంలో తెల్లవారు జామున అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీరామ్, సుజాతలను చికిత్స కోసం రిమ్స్ అసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ప్రేమికుడు శ్రీరామ్ పరిస్థితి విషమించి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. సుజాతకు చికిత్స అందిస్తుండగా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో మృతి చెందింది. ప్రేమికుల మరణం ఇరువురి కుటుంబాలలో విషాదం నెలకొల్పింది. ఇదిలా ఉండగా తమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతో మనస్తాపంతో ప్రేమికులు ప్రాణాలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.