కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. అయితే ఈసారి గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకు ఈ పెంపు నుంచి మినహాయింపును ఇచ్చింది. కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచింది.హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 43.50 రూపాయలను కేంద్రం పెంచింది.
అంతకు ముందు సెప్టెంబురు 1న ఇవే సిలిండర్ల గ్యాస్ ధరను రూ .75 పెంచింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ. 123 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1952, విజయవాడలో 1916, విశాఖలో 1825, ఢిల్లీలో రూ.1736 గా ఉండగా.. కోల్ కతాలో రూ.1805.5గా ఉంది.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న, మధ్య తరగతి హోటళ్లకు భారంగా మారనుంది.
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫుడ్, చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ముప్పై రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు రెండు సార్లు పెగడం వారికి ఇబ్బందిగా మారింది. కొద్దోగొప్పో వస్తున్న ఆదాయం కాస్తా పెరిగిన గ్యాస్ ధరలకే సరిపోతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.