మీ ఇంట్లో ఖాళీ గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. వెంటనే ఆ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసేయండి. ఎందుకంటారా? రేపటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అందుకే మీ ఇంట్లో ఖాళీ ఎల్‌పీజీ సిలిండర్లు ఉంటే మాత్రం ఈరోజే వాటిని బుక్ చేసుకోవడం ఉత్తమం. సిలిండర్ ధర ఎందుకు పెరగొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ ధర పెరగడానికి పలు అంశాలు కారణంగా నిలవొచ్చు. ఈరోజుతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగుస్తాయి. అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. 14 ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 130 డాలర్ల పైకి చేరింది. దేశంలో ఎల్‌పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ రేట్లతో అనుసంధానమై ఉంటాయి. అందుకే దేశీయంగా సిలిండర్ ధర పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారక విలువ కూడా ప్రభావితం చేస్తుంది. రూపాయి ఈరోజు ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. 76.96 స్థాయికి క్షీణించింది. శుక్రవారం రోజున అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 76.17 వద్ద క్లోజ్ అయ్యింది. రూపాయి పడిపోవడంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర పైపైకి చేరొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
క్రూడ్ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఎన్నికల ముగింపు వంటి అంశాల నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మార్చి 8 నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి.
కాగా మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దర రూ.105 మేర పైకి చేరింది. అలాగే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచేశారు. రూ.27 మేర పెరిగింది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. దీంతో ఇప్పుడు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. 2021 అక్టోబర్ నుంచి వంట గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగుతూ వచ్చింది.