రాజశేఖర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మెజారిటీ సభ్యులు

రాజశేఖర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మెజారిటీ సభ్యులు

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సందర్భాల్లోనూ సంయమనం కోల్పోరు. అవతలి వాళ్లు కవ్వించినా కూడా ఓపిక ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తి కింద మీడియా వాళ్లు, పక్కన చాలామంది సినీ పెద్దలు ఉండగా.. ఒక వ్యక్తి ప్రవర్తన పట్ల తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. సీనియర్ నటుడు రాజశేఖర్. ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా సంఘంలో విభేదాలన్నీ కట్టిపెట్టి ఇకపై అంతా సాఫీగా నడిచేలా చూడాలని చిరు ఉపదేశిస్తే.. రాజశేఖర్ దానికి పూర్తి భిన్నంగా మాట్లాడాడు.

గొడవల గురించి బహిరంగంగా చర్చించాల్సిందే అని పట్టుబట్టాడు. విభేదాల్ని మూసిపెట్టి ప్రయోజనం లేదంటూ అసంద్భోచితంగా మాట్లాడటంతో ఈ కార్యక్రమంలో తీవ్ర గందరగోళంగా మారింది. రాజశేఖర్ చెప్పాలనుకున్న విషయం ఏదైనా కావచ్చు.. ఆయన అందుకు ఎంచుకున్న వేదిక మాత్రం సరైంది కాదన్నది స్పష్టం.

ఆయన తీరు పట్ల ‘మా’లో మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మోహన్ బాబు కోపం పట్టలేకపోయారు. కృష్ణం రాజు సైతం రాజశేఖర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చిరు సంగతి చెప్పాల్సిన పని లేదు. రాజశేఖర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అని తీవ్ర స్వరంతోనే అన్నారు చిరు. అంతే కాదు.. మా డిసిప్లీనరీ కమిట ీదీనిపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. కృష్ణం రాజు సైతం ‘మా’ సలహాదారుగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు చెప్పారు.

చిరు, కృష్ణం రాజు.. రాజశేఖర్‌పై చర్యల గురించి మాట్లాడినపుడు ‘మా’ సభ్యులంతా చప్పట్లు చరచడం గమనార్హం. దీన్ని బట్టి రాజశేఖర్ చర్యల పట్ల అందరూ సుముఖంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ విషయమై కొందరు పట్టుబట్టే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశాల్ని కొట్టిపారేయలేం. సస్పెన్షన్ కొన్ని నెలలు ఉంటే ఉండొచ్చు కానీ.. రాజశేఖర్ తీరు వల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆయన కెరీర్ మరింత కుంటుపడేలా ఉంది. ఆయనపై ఇండస్ట్రీ జనాలు అప్రకటిత బ్యాన్ విధించినా ఆశ్చర్యం లేదంటున్నారు.