‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని ఆయన వ్యాఖ్యలపై తన తండ్రి మంచు మోహన్‌బాబు స్పందిస్తారని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని మంచు విష్ణు ఈ సందర్భంగా సూచించారు.
‘మా’ ఎన్నికల్లో తమ ప్యానల్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్యం చేశారు. రేపు లేదా ఎల్లుండి తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్ కూడా తనకే ఓటు వేస్తారని పేర్కొన్నారు.
‘నిర్మాతలు లేకుంటే సినీ ఇండస్ట్రీ లేదు. ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటం ఇది. నేను తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నాను. ప్రకాష్ రాజ్ ఎవరి పక్షాన ఉన్నారో చెప్పాలి. సినీ పరిశ్రమ పక్షమో, పవన్ కల్యాణ్ పక్షమో ప్రకాష్ రాజ్ చెప్పాలి’ అని విష్ణు డిమాండ్ చేశారు.
కాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న ఆయన నటుడు దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ వేశారు.