కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ధోనీ

కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ధోనీ

ఐపీఎల్ 2020 సీజన్ సందిగ్ధత కారణంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సమస్యలు ఇప్పుడు రెట్టింపయ్యాయని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌ లాల్ అభిప్రాయపడ్డాడు. 1983లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న మదన్‌ లాల్.. ఇటీవల టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా సునీల్ జోషి ఎంపికలో క్రియాశీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యాన్ని అధికారికంగా నిర్ణయించాల్సింది ఇప్పుడు ఆ చీఫ్ సెలక్టరే.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. ఆ తర్వాత జట్టుకి పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. దీంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా టీమిండియా క్రికెటర్లకి ఏటా ఇచ్చే వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి ధోనీని తప్పించింది. అయినప్పటికీ.. ఫామ్ నిరూపించుకుని మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ధోనీ ప్రయత్నించలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఝార్ఖండ్ తరఫున ఆడే అవకాశం ఉన్నా.. ఈ మాజీ కెప్టెన్ అలక్ష్యంగా వ్యవహరించాడనే అపవాదు ఉంది. మొత్తంగా ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ధోనీ ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐపీఎల్ జరగడంపై సందిగ్ధత నెలకొనగా.. ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది.

ధోనీ భవితవ్యంపై మదన్ లాల్ మాట్లాడుతూ ‘‘కెరీర్ పరంగా ధోనీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడింది లేదు. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ జరగకపోతే..? ధోనీ రీఎంట్రీ సమస్యలు మరింతగా పెరుగుతాయి. అయితే.. టీమిండియా మేనేజ్‌మెంట్, చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లు.. ధోనీ గురించి ఏం ఆలోచిస్తున్నారో..? నాకు తెలీదు’’ అని వెల్లడించాడు.