హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరాన్ని మాదాపూర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. గచ్చిబౌలి కేంద్రంగా కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓ అపార్ట్‌మెంట్లోని ఫ్లాట్‌లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.9లక్షల నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాకర్ల మాధవరెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఓ ఫ్లాట్‌ను రోజుకు రూ.6వేల చొప్పున అద్దెకు తీసుకుని ఈ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. నిర్వాహకుడు మాధవరెడ్డితో పాటు 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని, వీరంతా రియల్టర్లు, రైతులని తెలిపారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఫ్లాట్‌లో చాలాకాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.