ఉద్దేశపూర్వకంగా తనను సోషల్ మీడియాలో వేధింపులు చేస్తున్నారని.. ఓ వర్గం వారు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకర పోస్టులు చేస్తున్నారని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కమిషనర్ సజ్జనార్‌ను కలిసి లిఖిపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది.
నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాలు చేసిన మాధవీలత కొన్నేళ్ల కిందట బీజేపీలో చేరింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. అయితే ఇటీవల ఆమెను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఓ వర్గం తనను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు చేస్తున్నారని తెలిపింది.
ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితో అందులో తాను ఉన్నానని లేనిపోనివి కథనాలు సృష్టిస్తున్నారని చెప్పింది. దీనిపై ఇన్నాళ్లు సోషల్ మీడియాలో పోరాటం చేశానని.. ఇకపై మీరు చూసుకోవాలని కమిషనర్‌ను మాధవీలత కోరింది. ఈ తప్పుడు ప్రచారం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె విజ్ఞప్తి చేసింది.