సన్నీకి వార్నింగ్‌ ఇచ్చిన మాధవీలత

సన్నీకి వార్నింగ్‌ ఇచ్చిన మాధవీలత

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ముగిసినప్పటికీ కంటెస్టెంట్ల హడావుడి మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఫినాలేలో అడుగుపెట్టిన సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌.. ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్‌ మీట్‌, గెట్‌ టు గెదర్‌ అంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం తనకు అండగా నిలబడ్డవాళ్లను కనీసం పట్టించుకోవట్లేదన్న విమర్శలు మొదలయ్యాయి. అతడి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్‌ పేజీలు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల వంక తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం టీవీ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తూ తన కోసం ఎంతగానో పోరాడిన యూట్యూబ్‌ రివ్యూయర్లకు, ఓట్ల కోసం కష్టపడ్డ ఫ్యాన్‌ పేజీలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదట! దీంతో విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నటి మాధవీలత అగ్గి మీద గుగ్గిలమైంది. సన్నీకి ఓట్లేయాలంటూ మద్దతుగా నిలిచిన ఆమె అతడి తలబిరుసును తీవ్రంగా తప్పుపట్టింది.

‘సన్నీ కోసం సపోర్ట్‌ చేసిన ఫ్యాన్‌ పేజీలను వదిలేసి, రివ్యూయర్లను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని వదిలేసి, ఓట్లు వేయండని మొత్తుకునే వాళ్లను వదిలేసి బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్‌ ఛానళ్లకు అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కనీసం తనకు ఓట్లేయమని చెప్పనివాళ్లకు ప్రిఫరెన్స్‌ ఇచ్చి తప్పు చేస్తున్నాడు. బిగ్‌బాస్‌ షోలో సన్నీ నిజాయితీ మెచ్చి ఎంత ప్రమోట్‌ చేశానో, ఇప్పుడు తను చేస్తున్న తప్పుని కూడా ఎత్తి చూపిస్తాను.

సన్నీ తప్పు చేస్తున్నాడు. కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే నాకు చిరాకు. అతడి కోసం ఎంతమంది పీఆర్‌లా మారిపోయారు. వాళ్లకు థ్యాంక్స్‌ అని ఒక మాట చెప్తే అయిపోతుందా? తన గురించి గొప్పగా చెప్పుకొచ్చిన యూట్యూబ్‌ రివ్యూయర్ల పేర్లయినా మెన్షన్‌ చేశాడా? పోనీ తనకు తెలీకపోతే అతడి ఫ్రెండ్స్‌కి తెలీదా? కళ్లు నెత్తికెక్కాయా? తొలి ప్రాధాన్యత ఎవడికి ఇవ్వాలి? మీడియా నుంచి వచ్చా కాబట్టి మీడియాకే ప్రాధాన్యతనిస్తానన్నే సన్నీ బిస్కెట్‌ బాగానే ఉంది.

నీకోసం పర్సనల్‌ పీఆర్‌లా పనిచేసిన వాళ్లకు లైవ్‌ అడిగితే దొరక్కుండా పెద్ద ఛానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నావు.. నీ ఫ్యాన్‌ పేజెస్‌ మెయింటెన్‌ చేసిన వాళ్లను కలవాలి, నీకోసం మామూలు అమ్మాయిలు ఎన్ని మాటలు పడ్డారు? నీ విజయం వాళ్లదని ఫీలయ్యారు. నీ పీఆర్‌ ఫ్రెండ్‌ కనిపిస్తే చెంప పగలగొడతాను.

సాధారణ జనానికి విలువివ్వకపోతే అక్కడే ఆగిపోతావు గుర్తుంచుకో.. ఫ్యాన్‌ పేజీలను క్రియేట్‌ చేసిన ఒక్కరికీ సన్నీ నుంచి ఎటువంటి మెసేజ్‌, ఫోన్‌ రాలేదు. పాపం.. వాళ్లంతా సన్నీ ఏడిస్తే ఏడ్చారు, సన్నీ నవ్వితే నవ్వారు. వారం రోజులవుతున్నా ఇంకా టాప్‌ ఛానల్స్‌తోనే బిజీ ఉండటం తప్పు, నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తే అదే మీడియాలో నిలబెట్టి కడిగేస్తా. నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, తిక్కలేస్తే తాట తీసి ఆరేస్తా’ అని వార్నింగ్‌ ఇచ్చింది మాధవీలత. మరి దీనిపై సన్నీ ఏమైనా రియాక్ట్‌ అవుతాడేమో చూడాలి!