మహానటి మూవీ రివ్యూ… తెలుగు బులెట్

Mahanati Movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు :    కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, షాలిని పాండీ, క్రిష్
నిర్మాతలు :     అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్  
దర్శకత్వం :     నాగ్ అశ్విన్ 
సినిమాటోగ్రఫీ:   డానీ సంచేజ్-లోపెజ్
ఎడిటర్ :         కోటగిరి వెంకటేశ్వర రావు
మ్యూజిక్ :       మిక్కీ J. మేయర్

మహానటి సావిత్రి గారి జీవితం మీద ఓ సినిమా తీస్తున్నారు అనగానే యావత్ దక్షిణ భారత సినీ అభిమానుల్లో ఓ ఉత్సుకత. తెలిసిన కధ, కళ్ళ ముందు మెదిలిన మనిషి, ఓ చరిత్ర సృష్టించిన మహానటి మీద సినిమా అనగానే అది తీయడం ఎందుకని ఎవరూ అనుకోలేదు. అయితే ఎలా తీస్తారో అన్న సందేహం మాత్రం అంతటా వుంది. పైగా ఈ బాధ్యతని భుజానికి ఎత్తుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ సినీ వయసు ఒక్క సినిమానే. ఇక నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ గొప్ప సినీ నిర్మాత కుటుంబం, వైజయంతి సంస్థ మూలాలు వున్నవారు అయినప్పటికీ వీరి అనుభవం సావిత్రి గారి జీవితాన్ని వెనితెరపై ఆవిష్కరించడానికి సరిపోతుందా అని ఇంకెక్కడో అనుమానం. సినీ అభిమానులే కాదు చిత్ర రంగ ప్రముఖులు సైతం ఈ విషయంలో తమ కుతూహలాన్ని ఆపుకోలేకపోయారు. అందుకే రిలీజ్ రోజు ప్రసాద్ ఐ మాక్స్ దగ్గర ఓ పెద్ద స్టార్ హీరో సినిమాకి వచ్చినట్టు సినీ జనాలు వచ్చారు. మహానటి సినిమాలో నటిగా సావిత్రి వైభవాన్ని ఆవిష్కరించడానికి అన్నట్టు ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్ లాంటి వాళ్ళ కోసం జనం ఎగబడుతుంటే వాళ్ళు మాత్రం సావిత్రి గారి డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉందని చక్రపాణి పాత్రధారితో చెప్పించిన డైలాగ్ ని నిజం చేస్తూ ఈ తరం సినీ రంగం కూడా ఆమె గురించి తెలుసుకోడానికి తహతహలాడిందని ప్రసాద్ ఐ మాక్స్ 8. 45 షో చూస్తే అర్ధం అవుతుంది.

“మహానటి” చూసేందుకు థియేటర్ దాకా రావడానికి సావిత్రి గారి “ఆరా” పని చేసింది అనుకున్నా తీరా సీట్ లో కూర్చున్నాక కధని, కధనాన్ని నడిపించాల్సింది మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ . “ఎవడే సుబ్రహ్మణ్యం“ లాంటి కథతో తొలిసారి దర్శకుడుగా పరిచయం అయిన నాగ్ అశ్విన్ ఈసారి సావిత్రి గారి జీవిత కధని సినిమాగా తీయాలి అనుకోవడమే పెద్ద సాహసం. అయితే ఆ సాహసం చేయడానికి కావాల్సిన కసరత్తు చేయడంలో సుదీర్ఘ సమయం తీసుకున్న నాగ్ అశ్విన్ అందుకు తగ్గట్టే సినిమాని తీయగలిగారు. అసలు బాగా తెలిసిన వ్యక్తి జీవితాన్ని వెండి తెరకి ఎక్కించాలంటే వివాదాలు, అభిప్రాయ భేదాలు వంటి విషయాల మీదకే ఎక్కువ మంది మనసు వెళుతుంది. అలాంటి అన్ని విషయాలను టచ్ చేస్తూ కూడా ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించడమంటే సామాన్య విషయం కాదు. కానీ నాగ్ అశ్విన్ ఈ విషయంలో కధతోనే సావిత్రి సంతానాన్ని కూడా ఒప్పించారు.

ఇక సినిమాలోకి వస్తే సావిత్రి ( కీర్తి సురేష్ ) బాల్యం నుంచి మరణం దాకా ఓ కధ నడుస్తుంటే, ఆ కధకు సమాంతరంగా మధురవాణి, ఆంథోనీ ( సమంత, విజయ్ దేవరకొండ ) ప్రేమ కధ నడపడం అనే ఎత్తుగడతోటే నాగ్ అశ్విన్ స్మూత్ గా సినిమాని లాంచ్ చేసాడు. చిన్నతనం లోనే తండ్రిని కోల్పోయిన సావిత్రి ని తీసుకుని ఆమె తల్లి తోబుట్టువు కుటుంబాన్ని ఆశ్రయిస్తుంది. అక్కడ పెదనాన్న చౌదరి చొరవతో ఆమె సినిమాల్లో ఛాన్స్ కోసం మద్రాస్ వెళుతుంది. అక్కడ ఆమెకి తొలి ఫోటో తీసిన జెమినీ గణేశన్ తోనే ఆపై కొన్నేళ్ళకు ప్రేమలో పడడం పెళ్లి అయ్యిందని తెలిసి కూడా అతన్ని రెండో పెళ్లి చేసుకోవడం, ఇటు సినిమాల్లో రాణించడం వంటి విషయాల్లో దర్శకుడు పనితనం, రాసిన డైలాగ్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఓ పెళ్లి అయిన మగవాడు పెళ్లికాని అమ్మాయికి ఏమి చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు అనే దానిపై అదెలా సాధ్యం అని చాలా మందికి అనిపిస్తుంది.

ఈ సినిమాలో జెమినీ గణేశన్ కి రాసిన డైలాగ్స్ చూస్తే సావిత్రి మాత్రమే కాదు లోకం తెలియని ఆడవాళ్లు, భవిష్యత్ ని అంచనా వేయలేని మహిళలు ఎలా ప్రేమలో పడిపోతారో తెలుస్తుంది. సావిత్రిలో అమాయకత్వం, సినీ వైభవం తో పాటు ఆమె పట్టుదల తో సాధించిన విజయాలు, అదే మొడితనం తో, వ్యసనంతో జీవితాన్ని ఎలా దెబ్బ తీసుకున్నారో అన్న కోణం నుంచి దర్శకుడు దృష్టి పెట్టాడు. ఆ విషయాలను సుష్పష్టంగా చూపించడమే కాదు సావిత్రి జీవితాన్ని ఓ విఫల జీవితంగా కాకుండా ఓ జీవన ప్రయాణం గా చూపించడంలో నాగ్ సక్సెస్ అయ్యాడు. జీవితం ఎంత నాటకీయ మలుపులు తీసుకుంటుందో సావిత్రి గారి జీవితాన్ని చూస్తే అర్ధం అవుతుంది. స్థూలంగా ప్రేమికుడి కోసం అయిన వాళ్ళు అందరినీ, ప్రేమ కోసం చివరకు ప్రేమించిన వాడిని కూడా దూరం చేసున్నారని సావిత్రి గారి గురించి బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ పేక్షకుడి చెవుల్లో మార్మోగుతుంటాయి. ఇక సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించే క్రమంలో జర్నలిస్ట్ మధురవాణి తనను తాను తెలుసుకుని కొత్త జీవితానికి బాటలు వేసుకునే సీన్ సూపర్బ్.

ఇక మహానటిలో నటీనటుల్ని సావిత్రి గారు దగ్గర ఉండి పాఠాలు నేర్పించారు అన్నట్టుగా ఉంది వారి నటన. కీర్తి సురేష్ అయితే నిజంగా సావిత్రి ని మన కళ్ళ ముందు నిలిపింది. జెమినీ పాత్రలో సల్మాన్ దుల్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆయన నటన కి సూపర్బ్ అన్నది చాలా చిన్న మాట. ఇక ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు , అక్కినేని పాత్రలో నాగచైతన్య, ఎన్టీఆర్ పాత్రలో కొత్త కుర్రోడు, కేవీ రెడ్డి పాత్రలో క్రిష్, చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ తదితరులు కనిపించారు.

ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణలు దగ్గరికి వస్తే కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాలి. మూడ్ తో పాటు అప్పటి కాలానికి తగినట్టు చేసిన కొన్ని ప్రయోగాలు అద్భుతం. ఇక ఈ సినిమాని అద్భుతంగా మలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజయంలో అగ్ర భాగం రచయిత సాయి మాధవ్ కి ఇవ్వాల్సిందే. మహానటి చూసాక తెలుగు సినిమాకి మంచి రోజులు , కొత్త ప్రతిభ వచ్చిందన్న నమ్మకం ఇంకాస్త బలపడింది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ .. ”మహానటి “ జీవితం ఓ ప్రేమ ప్రయాణం.(ఇక్కడ ప్రేమ పరిధి ఎక్కువ )
తెలుగు బులెట్ రేటింగ్… 3.75/5 .