రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు.రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించారు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్‌డౌన్‌పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్‌డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు.కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.