Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్పైడర్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న భరత్ అను నేను చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్పైడర్ చిత్రం నిరాశపర్చినా… భరత్ అను నేనుపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడమే ఇందుకు కారణం. గతంలో వారిద్దరూ కలిసి చేసిన శ్రీమంతుడు పెద్ద విజయాన్ని నమోదుచేసుకోవడంతో… భరత్ అను నేను సినిమా ప్రకటించిన దగ్గరనుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడని టాక్ వచ్చింది. ఇటీవలే అసెంబ్లీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.
సినిమాకు సంబంధించి… ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ ఉదయం భరత్ అనే నేనులో మహేష్ బాబు స్టిల్ ఒకటి బయటికొచ్చింది. ముందు ఇద్దరు గన్ మెన్లు ఉండగా, వారి వెనక మహేశ్ డిగ్నిపైడ్ గా నడుస్తున్న ఈ ఫొటోను భరత్ అను నేను ఫస్ట్ లుక్ గా అందరూ భావించారు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. అయితే దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.
ఇది చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఫొటో కాదని, సెట్ లోని స్టిల్ ను ఎవరో లీక్ చేశారని ఆయన చెప్పారు. చిత్రాన్ని ఉత్తమంగా ప్రేక్షకులకు అందించాలని కష్టపడుతున్న తమ యూనిట్ సభ్యులకు ఇలాంటి లీకుల వల్ల బాధే మిగులుతుందని కొరటాల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ స్టిల్ ను మీడియాలో ప్రసారం చేయవద్దని కోరారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న భరత్ అను నేనులో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. లీకయిన ఫొటోలో మహేశ్ బాబు వెనక బ్రహ్మాజీ కూడా కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి వెనకు ఉన్న బ్రహ్మాజీ చీఫ్ సెక్రటరీ పాత్ర పోషిస్తున్నాడని అభిమానులు అంచనావేస్తున్నారు.