డైరెక్టర్ కి చాలెంజ్ విసిరిన మహేష్

దాదాపు రెండేళ్ళు అవుతుంది అనుకుంటా విదేశాల్లో ఐస్ బకెట్ చాలెంజ్ అని ఒకటి మొదలయ్యింది. నిండా ఐస్ ఉన్న బకెట్ నీళ్ళు నెత్తిన గుమ్మరించుకుంటే ఏమొస్తుంది అనుకున్న మన ఇండియన్స్అందునా తెలుగు వాళ్ళు దానిని రైస్ బకెట్ చాలెంజ్ ని చేసి అలా వచ్చిన బియ్యన్ని అనాదాశ్రామాలకి అందచేసి తమ మంచి మనసు చాటుకున్నారు. అప్పటి నుండి ఎన్నో విషయాల్లో చాలెంజ్‌లు విసరడం ఆనవాయితీగా వస్తోంది, సేలెబ్రిటీలు విసురుకుంటున్న ఈ చాలెంజ్ లు సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి. మొన్నామధ్య క్రీడా శాఖా మంత్రి రాజ్ వర్ధన్‌ విసిరిన హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌ చాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. మోడీ నుండి మొదలయ్యి టాలివుడ్‌కు ప్రవేశించిన ఈ చాలెంజ్‌ను హీరోలు అందరూ స్వీకరించారు.

తాజాగా తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య మద్దతు లభిస్తోంది. పచ్చదనంతోనే నిండుదనం అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, భార‌త మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్క‌ర్‌, టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ ఛాలెంజ్‌ చేసిన విష‌యం తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఛాలెంజ్‌ స్వీకరించిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు సోమ‌వారం త‌న కూతురు సితార‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. తనను ఇలాంటి ఛాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు మ‌హేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అనంత‌రం త‌న ముద్దుల త‌న‌య సితార‌, త‌న‌యుడు గౌతంతో పాటు ద‌ర్శ‌కుడు వంశీ పైడిపెల్లికి ఆయ‌న ‘హరితహారం’ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ లు కేవలం సెలెబ్రిటీలకే కాక తమ తమ అభిమాన అనుచర గణానికి కూడా స్టార్లు, పొలిటీషియన్లు చేస్తే బాగుణ్ను, వారి వారి సినిమాల రిలీజ్ కో, లేదా వారు పర్యటిస్తున్న సమయంలోనో, లేదా వారి వారి పుట్టిన రోజుల సమయంలోను ఏర్పాటు చేసే బ్యానర్ల ఖర్చుతో కొన్ని వేల మొక్కలు కొని నాటవచ్చు, హీరోలు హీరో ఇమేజ్ కలిగున్న రాజకీయ నాయకులూ ఈ పాయింట్ మీద దృష్టి పెడితే బాగుంటుంది.

                                                                                               వశిష్ట