పోలీసుల ముందుకు మహేష్‌.. ఎందుకంటే?

Mahesh Met The Telangana State Police Academy

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం 25వ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఉన్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వంశీ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్‌బాబు సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు గడ్డం మరియు మీసాలతో కనిపించింది లేదు. ఈ చిత్రంలో పాత్రకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశ్యంతో మహేష్‌బాబు గడ్డంతో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌ను కాలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. కాలేజ్‌ డేస్‌కు సంబంధించిన సీన్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడే సీన్స్‌ కూడా ఉండబోతున్నాయి.

క్రికెట్‌ మ్యాచ్‌ సీన్స్‌ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రికెట్‌ మ్యాచ్‌ను తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తున్న పోలీసు అకాడమిలో తమకు సంబంధించిన షూటింగ్‌ నిర్వహించుకునేందుకు అనుమతించాలంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు మహేష్‌బాబులు హైదరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులను కలవడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు భారీ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించేందుకు ఒప్పుకున్నారు. క్రికెట్‌ సీన్స్‌తో పాటు కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను కూడా అందులో చిత్రీకరించబోతున్నారు. సినిమాకు చాలా కీలకం అయిన సీన్స్‌ అవ్వడం వల్లే అక్కడ వంశీ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.