Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భరత్ అను నేనులో ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయిన మహేశ్ బాబు… నిజజీవితంలో మాత్రం రాజకీయాలకు దూరమని స్పష్టంచేశారు. తనకు వందేళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే నటిస్తానని, రాజకీయాల్లోకి రానని చెప్పారు. భరత్ అను నేను విజయం సాధించిన సందర్భంగా మహేశ్ బాబు తన బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, సినిమా దర్శకుడు కొరటాల శివతో కలిసి విజయవాడలో పర్యటించారు. ముందుగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న మహేశ్ బాబు అనంతరం గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ లో అభిమానులతో కలిసి భరత్ అను నేను వీక్షించారు.
తరువాత డీవీమానర్ హోటల్ లో చిన్నారులను కలిశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. చిన్నారులతో కలిసి సెల్ఫీలకు పోజులిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్ బాబు విజయవాడ రావడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడను సెంటిమెంట్ గా భావిస్తానని, గతంలో ఒక్కడు, పోకిరి, దూకుడు విజయోత్సవ సభలను విజయవాడలోనే నిర్వహించిన సంగతి గుర్తుచేసుకున్నారు. భరత్ అను నేనులో తనను తండ్రి కృష్ణతో పోల్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాకు ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.