‘శ్రీమంతుడు’ తరవాత రెండు డిజాస్టర్లు చూసిన సూపర్ స్టార్ మహేష్‌బాబు భరత్ అనే నేనుతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. మూడు భారీ నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా తరవాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సుకుమార్-మహేష్ కాంబోలో వచ్చే సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా తరుచూ జరుగుతూనే ఉంటుంది. దీనిపై దినపత్రికల్లో రోజుకో వార్త వస్తుంటుంది. అందరికీ తెలిసిన ఈ స్మగ్లింగ్ అంశాన్నే నేపథ్యంగా తీసుకొని సుకుమార్ ఈ చిత్ర కథను తయారుచేసుకున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే జూన్ నుంచి మహేష్‌బాబును సుకుమార్ శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు. సుకుమార్-మహేష్ కాంబినేషన్లో ‘1 నేనొక్కడినే’ సినిమా వచ్చింది. కథ, కథనం వైవిధ్యంగా ఉన్నా ప్రేక్షకులకు సినిమా అర్ధం కాకపోవడంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. రంగస్థలం హిట్టుతో ఫామ్‌లో ఉన్న సుకుమార్ ఈసారి ఎలాగైనా మహేష్‌తో హిట్టు కొట్టాలని స్క్రిప్టును చాలా కన్విన్సింగ్ గా తయారుచేస్తున్నారట.