మలేషియాలో వరదలు

మలేషియాలో వరదలు

దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు.

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్‌ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు.

డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు.ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్‌లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.