టీడీపీ గంజాయి వనం నుండి వైసీపీ తులసి వనంలోకి వచ్చా !

టీడీపీ నుండి సస్పెండ్ అయిన నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి తన సోదరులతో కలిసి మేడా చేరుకున్నారు. ఆయన్ను వైసీపీ నేత విజయసాయిరెడ్డి లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, కడప జిల్లా రాజకీయాలపై ఆయన జగన్ తో చర్చించారు. మేడా ఈరోజు జగన్ ను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారనీ, ఈ నెల 31న అధికారికంగా వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ నెల 31న మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నాయి. ఈరోజు రాజంపేట, జమ్మలమడుగు నేతలతో అమరావతిలో చంద్రబాబు నిర్వహించిన భేటీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యకర్తలు, నేతల డిమాండ్ నేపథ్యంలో మేడాను చంద్రబాబు సస్పెండ్ చేశారు. అలాగే జగన్ ను లోటస్ పాండ్ లో కలుసుకున్న అనంతరం మేడా మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీ అనే గంజాయి వనం నుంచి వైసీపీ అనే తులసి వనంలోకి వచ్చానని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఇప్పుడు తన ప్రాణం ప్రశాంతంగా, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ మరణం తరువాత తాను టీడీపీలో చేరి ఎమ్మెల్యేను అయ్యానని కానీ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

తాను టీడీపీలో గత నాలుగున్నరేళ్లు నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే తాను ఇన్నిరోజులు టీడీపీలో కొనసాగానని మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. తన పదవీకాలంలో రాజంపేటలో రూ.800 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. వయసులో చిన్నవాడైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి జగనే సరైన వ్యక్తి అని మల్లికార్జున రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఏ కుటుంబం చేయనట్లుగా వైఎస్, షర్మిల, జగన్ ప్రజల దగ్గరకు పాదయాత్ర చేస్తూ వెళ్లారని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమైనట్లు చెప్పారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు ఇంకా అథ: పాతాళానికి పోతారనీ, నాశనం అయిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు కళ్లబొల్లి మాటలు చెబుతారనీ, కానీ చెప్పిన ఒక్క పని కూడా చేయరని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించారనీ, ఆ సూచనను పాటిస్తానని అన్నారు. జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. టీడీపీ విప్, ఎమ్మెల్యే పదవికి ఈరోజే రాజీనామా చేస్తాననీ, రేపు వాటిని టీడీపీ ఆఫీసుతో పాటు స్పీకర్ కు పంపుతానని పేర్కొన్నారు. తాను జగన్ నే నమ్ముకున్నానని స్పష్టం చేశారు.