పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 స్థానాల్లో 213 ఎమ్మెల్యేలను గెలుచుకుని ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా ఓటమి మాత్రం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆరు నెలల్లోపు అసెంబ్లీ సభ్యురాలు కాకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందే.మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు.
ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు విసిరిన సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వంలో త్రుటిలో పరాజయం పొందారు. ఆమెను బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 16వ తేదీ ఉపసంహరణ. ఈ స్థానంతో పాటు మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.