ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ.. ఆట ఇంకా అయిపోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించండం అంత సులభం కాదని తెలిపారు.దేశంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా బీజేపీకి లేవని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గత రాష్ట్రపతి ఎన్నికల మాదిరి ఈసారి అంత ఈజీ కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య అధికంగానే ఉందని తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభల్లోని ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కళాశాల ద్వారా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఓట్ల విలువను నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు. 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు.
మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకోసమే కేంద్రంలోని అధికార బీజేపీతో పోరాడటానికి సిద్ధమవుతోంది.