పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ ఉప- ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగగా.. రౌండ్ రౌండుకు ఆమె మెజారిటీ పెరుగుతూ వచ్చింది. లెక్కింపు 21 రౌండ్లు కొనసాగగా.. అన్ని రౌండ్లలోనూ దీదీయే ఆధిక్యత ప్రదర్శించారు. చివరకు 58,389 ఓట్ల మెజారిటీతో విజయబావుటా ఎగురువేశారు. తాజా విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.
మార్చి- ఏప్రిల్‌లోని జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి, తన మాజీ సహచరుడు సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీదీ ఓడిపోయినా పార్టీ ఘన విజయం సాధించడంతో మే 5న ముఖ్యమంత్రిగా ఆమె మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఆమె ఎన్నిక కావాల్సి ఉంది.
గడువు సమీస్తుండటంతో రాజకీయ సంక్షోభం తప్పదేమోననే ఆందోళన వ్యక్తమయ్యింది.అయితే, బెంగాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నిక జరిపించాలన్న ప్రభుత్వం విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. కోవిడ్-19 వ్యాప్తిపై బెంగాల్ ప్రభుత్వం నుంచి అందిన నివేదికను పరిగణనలోకి తీసుకుని మూడు చోట్ల ఎన్నికలను జరిపించింది. భవానీపూర్, సంషేర్‌గంజ్, జంగీపూర్ మొత్తం మూడు స్థానాలకు సెప్టెంబర్ 30న ఈసీ పోలింగ్ నిర్వహించింది.
ప్రతిష్ఠాత్మకంగా మారిన భవానీపుర్ నుంచి మమతా బెనర్జీ పోటీలో నిలిచారు. అయితే, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి వీలుగా భవానీపుర్ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్‌కు మంచి పట్టుండటం, దీదీ గతంలో 2011, 2016లో రెండు ఇక్కడ నుంచే గెలుపొందడంతో తాజా ఉప-ఎన్నికల్లో ఆమె గెలుపు నల్లేరు మీద నడకగా సాగింది. సంషేర్‌గంజ్, జంగీపూర్‌లోనూ టీఎంసీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు.