భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం మమతా మంగళవారం గవర్నర్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఎంసీ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. గవర్నర్ బంగ్లాలో కాకుండా.. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో చేయించాలని కోరినట్లు తెలిపారు.
అక్టోబరు 3న విడుదలైన భవానీపూర్,జంగీపూర్, షంషేగంజ్ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్కు 26,428 ఓట్లు సాధించింది. ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది. విపక్షనేతలు.. రైతులను పరామర్శించకుండా అడ్డుకోవడంపై ఛటర్జీ మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.