ఆస్తులు తగాదాలు కుటుంబాలను ఎంతలా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పనవసరం లేదు. పైగా ఆస్తి విషయంలో మనుషులు కూడా తన పర భేదం మరిచి అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ క్రమంలో తమ జీవితాలను కటకటాల పాలు చేసుకునేవారు కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే…పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వినిత్ కుమార్ అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి విషయమై తండ్రితో గొడవ పడుతున్నాడు. అయితే తండ్రి ఇల్లు అమ్మడానికి నిరాకరించాడు. దీంతో కోపం పెంచుకున్న వినిత్ కుమార్ కన్నతండ్రిని గొంతు కోసి చంపాడు. అతను అక్కడితో ఆగకుండా తండ్రి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కాల్చేశాడు.
అయితే స్థానికులు సమాచారం అందిచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అని చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక నిందుతుడు నేరం చేసినట్లు అంగీకరించాడని కూడా చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మృతుడి భార్య ఆశాదేవి తన కుమార్తెతో కలిసి ఆగ్రాలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని తెలిపారు.