రాత్రికి రాత్రే కోటిశ్వరుడు

రాత్రికి రాత్రే కోటిశ్వరుడు

అదృష్టం ఎప్పుడు, ఎలా, ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదనడానికి ఇదో తాజా ఉదాహరణ. రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడన్న వార్తలు ఇప్పటికే మీరు చాలా చదివి ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని కోటీశ్వరున్ని చేయలేదుగాని లక్షాధికారిగా మారే అవకాశం వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఓ గనిలో పనిచేస్తున్న కార్మికుడికి ఒకటి, రెండు కాదు… ఏకంగా మూడు విలువైన వజ్రాలు దొరికాయి. వీటి విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకూ ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సుబాల్‌ అనే కార్మికుడు పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా.. అతనికి 7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి వాటిని తనతో పాటు తీసుకెళ్లకుండా నిజాయితీగా జిల్లా వజ్రాల కేంద్రానికి అప్పగించాడని, ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని వేలం వేస్తామని తెలిపారు. వేలం తరువాత 12 శాతం పన్నును మినహాయించుకుని, మిగిలిన 88 శాతం మొత్తాన్ని సుబాల్ కు అందిస్తామని తెలియజేశారు.

కాగా, కొన్ని రోజుల క్రితం బుందేల్ ఖండ్ రీజియన్ లోని గనుల్లో ఓ కార్మికుడికి 10 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు లభించాయి. దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉన్న పన్నా, వజ్రాల గనులకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గనుల్లో నిత్యం వందలాది మంది వజ్రాల కోసం అన్వేషణలు సాగిస్తుంటారు.