పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం

పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ టాలీవుడ్ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) కన్నుమూశారు. ఈ రోజు (శుక్ర‌వారం) తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియ‌ జేస్తున్నారు.

పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరిలో పెద్దవారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు. ఎన్టీఆర్‌ కాలం మొదలుకొని నేటివరకు కథలు, డైలాగ్స్ రాయడంలో పరుచూరి బ్రదర్స్ (ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌) ద్వయానికి తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్,‌ కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర హీరోలందరి సినిమాల‌కు రచయితలుగా పని చేసిన అనుభవం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సొంతం.