అనుమానం పెనుభూతం అయింది. మద్యంమత్తు, కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు భర్త. జగిత్యాల జిల్లా చెర్లపల్లిలో భార్యను గొడ్డలితో భర్త శంకరయ్య దారుణంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. తల్లి హత్య తండ్రి కటకటాల పాలు కావడంతో ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ బోరున విలపించారు. జిగిత్యాల జిల్లాలో భార్య భర్త దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టిస్తుంది.
అంబారిపేటకు చెందిన సుజాతకు వెలగటూర్ మండలం చెర్లపల్లి కి చెందిన శంకరయ్యతో 16ఏళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకు జన్మించారు. సాఫీగా సాగుతున్న కాపురంలో మద్యం మత్తు కుటుంబ కలహాలకు దారి తీసింది. ఉపాధి నిమిత్తం ముంబైకి వెళ్లిన భర్త తాను సంపాదించిన సొమ్ము తాగుడికే ఖర్చు చేసేవాడు. కూలీ పనితో సుజాత ఇద్దరు కొడుకులను పోషిస్తున్నది.
వారం రోజుల క్రితం ముంబై నుంచి ఇంటికి చేరిన శంకరయ్య భార్యపై అనుమానం పెంచుకుని గొడవపడ్డాడు. తాగొచ్చి భర్త గొడవ పడటంతో భయంతో సుజాత రాత్రంతా వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. తెల్లవారుజామున ఇంటికి రాగా మద్యం మత్తులో ఆగ్రహంతో ఉన్న భర్త శంకరయ్య భార్యను నరికి చంపాడు.
భార్య ప్రాణాలు పోయాక అక్కడే కొద్దిసేపు గొడ్డలి పట్టుకొని కూర్చుండిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే శంకరయ్య నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు తెలిపారు.
మద్యం మత్తు, ఆర్థిక ఇబ్బందులు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి భార్య ప్రాణాలు తీయడంతో వారి ఇద్దరు కొడుకులు అనాధలుగా మారారు. ఏం జరిగిందో తెలియక ఇద్దరు కొడుకులు అభిరామ్, అజాయ్ దిక్కులు చూస్తూ బోరున విలపించారు. ఊహ తెలియని ఆ పిల్లలు రాత్రి అమ్మ నాన్న గొడవ పడ్డారని తెలిపారు. ఏటో వెళ్లిపోయిన అమ్మ, తెల్లారేసరికి బాత్ రూమ్ వద్ద పడిపోయి ఉందని పెద్ద కొడుకు అభిరామ్ తెలిపారు.
స్థానికంగా ఉండని భర్త, భార్యపై అనుమానం తెంచుకొని నిత్యం గొడవ పడేవాడిని స్థానికులు తెలిపారు. శంకరయ్యకు ఇదివరకు ఓ పెళ్లి కాగ విడాకులు తీసుకొని సుజాతను రెండో వివాహం చేసుకున్నాడని చెప్పారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.