ఆన్లైన్ పరిచయం ఓ యువతి ప్రాణాలు బలితీసుకుంది. ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తికి గతంలోనే వివాహమైందని.. ఇద్దరు పిల్లల తండ్రని తెలియడంతో దూరం పెట్టింది. అయినా వదలని ప్రియుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనను వేధించడం మానుకోవాలని.. లేకుంటే చనిపోతానంటూ బెదిరించేందుకు ఫోన్ చేసింది. కానీ చివరికి ఆ వీడియో కాల్లోనే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో జరిగింది.
చెన్నైలోని పెరుంబాక్కం ప్రాంతానికి చెందిన కె.భారతి(24) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. విరుదునగర్ జిల్లా అలంకుళంకి చెందిన ముత్తు కుమరేశన్(32)తో ఆమెకు వీడియో చాట్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. నాగపూర్లో ఆర్మీ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న ముత్తు నేరుగా కలవాలని ఉందంటూ గత నెలలో చెన్నై వచ్చాడు. ఆ సమయంలో అతనికి గతంలోనే వివాహమైందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో భారతి మనస్థాపానికి గురైంది.
ఇక అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అతన్ని దూరం పెట్టింది. అయినా వినని ముత్తు ఆమెకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసేవాడు. ప్రియుడి వేధింపులతో విసిగిపోయిన భారతి ఓ రోజు వీడియో కాల్ చేసి తీవ్రంగా హెచ్చరించింది. తనను వదిలేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ బెదిరించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కత్తితో గొంతు కోసుకుంటానంటూ ఆయుధం చూపించింది.
ఆవేదనలో ఉన్న ఆమెకు సర్దిచెప్పాల్సింది పోయి ప్రియుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. కత్తితో కోసుకోవడం కంటే ఉరేసుకోవడం బెటర్ అని.. త్వరగా ప్రాణం పోతుందంటూ సలహా ఇచ్చాడు. అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న వీడియోకాల్లోనే ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. సూసైడ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
అందులో భాగంగా ఆమె ఫోన్ని పరిశీలించడంతో వీడియోకాల్ బాగోతం బయటపడింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటే ఉరి బెటర్ అంటూ ముత్తు చెప్పడం.. ఆమె వీడియో కాల్లోనే ఆత్మహత్య చేసుకోవడం రికార్డయ్యాయి. ఆ వీడియో సాక్ష్యంతో యువతి ఆత్మహత్యకు కారణమైన ముత్తుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.