‘ఆమ్నీషియా నీళ్ల’ పేరిట ఓ మహిళను మోసం చేశాడు ఓ సైబర్ నేరగాడు. ఈ సంఘటన చైనాలోని జియాంగ్‌షూ ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఈస్ట్ చైనా, షూఝౌకు చెందిన కియాన్ అనే మహిళ కొద్దిరోజుల క్రితం ప్రియుడితో గొడవపడింది. అతడి జ్ఞాపకాలతో ప్రతీ రోజు నరకం అనుభవించేది. ఎలాగైనా ఆ జ్ఞాపకాలను మర్చిపోవాలనుకునేది. ఇందుకోసం ఏదైనా మందు దొరుకుతుందన్న ఆశతో ఆన్‌లైన్‌లో వెతికింది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘ఆమ్నీషియా వాటర్’ దర్శనమిచ్చింది. ఆన్‌లైన్‌లో దాని విలువ 500 యాన్‌లుగా ఉంది. దాన్ని తాగితే బాధపెట్టే జ్ఞాపకాలనుంచి సాంత్వన లభిస్తుందని రాసి ఉంది.
దీంతో ఆమె ఆన్‌లైన్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ‘ఆమ్నీషియా నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్!’ అని ఆమెకు చెప్పాడు. మరికొన్ని మాయమాటలు కూడా చెప్పి రూ.6500యాన్‌లు వసూలు చేశాడు. అనంతరం ఓ టైం, ప్లేస్ చెప్పి.. ఆ సమయానికి ఆ ప్రదేశానికి సదరు మతిమరుపు మందును తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. అయితే చెప్పిన టైం దగ్గర పడగానే రాలేనంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న కియాన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.