మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య

మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రాహుల్‌గౌడ్, సుందరయ్య నగర్‌కు చెందిన మౌనిక రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

అనంతరం వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, శుక్రవారం భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన రాహుల్‌ గౌడ్‌ (27) శనివారం ఉదయం పురుగుల మందు తాగి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ తన వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇదివరకే మరణించగా ఉన్న ఒక్క కొడుకును కొల్పోవడంతో తల్లి అనాథగా మిగిలిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.