ఎంటెక్‌లో సీటు రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌కు చెందిన ఎండీ షఫీ ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్ కోసం ఇటీవల ఎంట్రెన్స్ రాయగా సీటు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎంటెక్ చేయకపోతే మంచి ఉద్యోగం రాదని నిరాశకు లోనయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో బయటికి వెళ్తున్నానని చెప్పి అలుగునూరు శివారులోని కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు.
అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేసి తన తమ్ముడికి కాకతీయ కెనాల్ వద్ద బైక్ ఉంది తీసుకెళ్లాలని మెసేజ్ చేశాడు. ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కెనాల్ వెంట వెతుకుతుండగా బైక్ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కెనాల్‌లో గాలించగా మృతదేహం బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.