భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతోపాటు, స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలవటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరానికి చెందిన కే.బాలరాజుకు ఏలూరు శివారు చొదిమెళ్ల గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు బాలరాజు. ఇటీవల అత్తింట్లో బంధువు మృతి చెందటంతో బట్టలు పెట్టేందుకు భార్య స్వగ్రామం చొదిమెళ్ల వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17న బాలరాజు, జ్యోతి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య చీమలమందు తాగటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సతో ఆరోగ్యం కోలుకుని ఇంటికి తిరిగివెళ్లింది. భర్త బాలరాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, కొడుతున్నాడంటూ జ్యోతి 100 నంబర్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసింది. గురువారం ఉదయం ఏలూరు రూరల్ పోలీసులు బాలరాజుకు ఫోన్ చేసి విచారణ నిమిత్తం రావాలని చెప్పారు. జ్యోతి తన తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
బాలరాజు కూడా స్టేషన్‌కు వెళుతున్నానంటూ చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే స్టేషన్‌కు వెళ్లకుండా పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.