స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్ భవనం ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గౌరీష్‌కు అతని తల్లి ఫోన్ చేయగా స్పందించలేదు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసినా ఫలితంలేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పింది.
పరీక్షలు కావడంతో స్నేహితుల రూమ్‌లకు వెళ్లి చదువుకుంటూ ఉంటాడేమోనని రాత్రి 8.30 గంటల సమయంలో అన్ని రూమ్‌లను వెతుకుతుండగా ఒక గది తలుపులు తెరుచుకోలేదు. తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని గౌరీష్ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, పట్టణ ఎస్‌ఐ తలారి రామకృష్ణ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. తాను బాగా చదువలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నట్లుగా గౌరీష్ సూసైడ్ లెటర్ రాశాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.