మరదలిని ప్రేమించి, వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి మూల్యంగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా తరేయా సుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిరోలి డాన్లో నివాసం ఉంటున్న నారాయణ్ సాహ్ కుమారుడు అచ్చెలాల్ సాహ్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు అచ్చెలాల్ సాహ్‌కు జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధ్ నగర్‌కు చెందిన మంజు దేవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక భార్యతో కలిసి అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఐతే అదే ఇంట్లో ఉంటున్న మరదలు బేబీ దేవితో అచ్చే లాల్ సాహ్ ప్రేమలో పడ్డారు. ప్రేమ ఎంతగా పెరిగిందంటే వారిద్దరూ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు కూడా. కాగా గత బుధవారం రాత్రి ఇద్దరు భార్యల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి అచ్చే లాల్ ఓ గదిలోకెళ్లి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో గురువారం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతుడు తన అత్తమామల ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారని మీడియాకు తెలిపారు.