మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అక్బర్‌బాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే అక్బర్ (40) మొదటి భార్య అజ్మరీతో కలిసి ఉంటున్నాడు. నిత్యం మద్యం తాగి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను భార్యతో గొడవపడ్డాడు.
అదే కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చి దిల్‌కుష్ ఫంక్షన్‌హాల్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కాడు. కింద ఉన్నవారు వారిస్తున్నా వినకుండా అక్కడి విద్యుత్ వైర్లను తాకాడు. దాంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌తో అతను అంత ఎత్తు నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి పడిపోయాడు. తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసమయంలో ఆ రహదారిపై వెళుతున్న వారు తీసిన అతని ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.