సంక్రాంతి పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది.. మృత్యురూపంలో వచ్చిన గాలిపటం మాంజా దారం కుటుంబ పెద్దను కబళించింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన పస్తం భీమయ్యకు భార్య సారవ్వ, కుమారుడు ప్రవీణ్, కూతురు అక్షయ ఉ న్నారు. వీరు బేడబుడగజంగాల వారు. స్వగ్రామంలో ఇల్లు, భూమి, చేయడానికి పని లేకపోవడంతో బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట మంచిర్యాల జిల్లా వేంపల్లికి వలస వెళ్లారు. భీమయ్య అక్కడ పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసి, విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇద్దరు పిల్ల లను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు.ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న భీమయ్య కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. అతని కాలికి దెబ్బ తగలడంతో సంక్రాంతి రోజు మంచిర్యాల పట్టణంలోని ఆస్పత్రికి తన ద్విచక్రవాహనంపై భార్య సారవ్వతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాలిపటం మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. గట్టిగా బిగుసుకుపోవడంతో గొంతు తెగి, అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లెదుటే భర్త ప్రాణాలు పోవడంతో సారవ్వ రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.